Iqbal Chand's

కలేకూరి సమాధి – తొలిపరిచయం

Kalekoori Prasad2

కలేకూరి కొన్ని జ్ఞాపకాలు

నిర్దయ  సుడిగాలి! కొంచెం జాగ్రత్త వహించు

ఇక్కడే నా ప్రాణస్నేహితుడు గాఢ నిద్ర లోవున్నాడు!

అతడో నిప్పురవ్వ! నిన్ను సైతం దహించగలడు–

 వో చల్లని మేఘమాల! కొంచెం కరుణించి పయనించండి .

ఇక్కడే నా ప్రాణస్నేహితుడు యోగ నిద్రలో వున్నాడు!

అతడో ప్రేమ మధు పాత్రిక! మిమ్మల్నీ మత్తులో ముంచగలడు —

                                                            కలేకూరి సమాధి/ ఇక్బాల్ చంద్.

తొలిపరిచయం:

1993 లో వొక వేసవి మధ్యాహ్నం  ప్రముఖ  కార్టూనిస్టు జావెద్, నేను కలసి సత్యం ప్రొసెస్ కు వెళ్ళాం. బైరాగి రచనల కోసం సత్యం గారు ప్రేమతో లోనికి వెళ్ళి వెతికి రెండు ఆలూరి బైరాగి గారి  పుస్తకాల సెట్లు మా చేతుల్లో పెట్టారు. ఆ క్షణం మా గుండెల్నిండా బైరాగి. సత్యం ప్రొసెస్ నుండి అలా బయటకి వచ్చి నేను బైరాగి గురించి చెబుతుంటే జావెద్ ఊ కొడుతున్నాడు. ఆనందాశ్చర్యాలతో .  అంతలో అతనికి తెలిసిన ఒక బక్కబలచని నిటారు జండా లాంటి వొక స్నేహితుడు కలిశాడు. వళ్ళిద్దరి మాటల మధ్య అతణ్ణి పరిచయం చేశాడు. ఇతడే కలేకరి  ప్రసాద్ అని. వీడు ఇక్బాల్ చంద్  అని నన్ను.   మర్యాదగా నేనేమో ప్రసాద్ గారు ఎలా వున్నారు అని అడిగాను. గార్లు గీర్లు ఏంటిరా అని సిగరెట్టు ఆఫర్ చేశాడు. నా చేతుల్లోని బైరాగి పుస్తకాల సెట్టుని జావెద్ చేతిలో వుంచి బలవంతంగా జావెద్ ని పంపించి నన్ను తనతో తీసుకెళ్ళాడు. అలా మండు వేసవి పగలంతా, రేయంతా బ్లాక్ కాఫీల్ని చప్పరిస్తూ  ఎప్పటికో తెల్లవారుజామున  3-4 ప్రాంతంలో చిలకలగూడ జావెద్ ఇంటి ఎదురుగా వదిలేసి వెళ్ళాడు. ఆ రాత్రంతా చాలా చాలా మట్లాడుకున్నాం. కొన్ని రాయదగ్గవి, మరికొన్ని రాయలేనివి. రాయదగ్గవి ఇప్పుడు రాయలేను. రాయలేనివి ఎప్పటికీ రాయను.

కలేకూరి ప్రతిభ:  

అత్యంత ప్రతిభావంతుడైన చదువరి, కవి. అతని కవిత్వం తత్త్వికతను రెండు భాగాలుగా విడదీస్తే మొదటి భాగం శత్రు నిర్మూలన. రెండో భాగం తమ జాతికి సమాన హక్కుల  సాధన. ప్రధమార్ధంలో మార్క్స్ స్వాప్నిక ముద్ర. ద్వితీయార్థంలో అంబేద్కరిజం రియలిజం! 

దళిత సాహిత్యం ఆరంభం లోనే కనిపెట్టి దాన్ని పరిశీలించి విశ్లేషించిన వాడు ప్రసాద్. అలాగే మైనారిటీ కవిత్వాన్ని మొదట డిస్కవర్ చేసినవాడు కూడా కలేకూరి ప్రసాదే. ఈ మాట చాలామంది ఇప్పుడు వొప్పుకోరు గానీ 1993 లోనే అతడు “దళిత సాహిత్యం” పేరిట వొక బుక్ లెట్  లాంటి చిన్ని పుస్తకంలో చాలా పెద్ద విశ్లేషణే చేశాడు. నన్ను “ఆరోవర్ణం కవి” ఇక్బాల్ చంద్ అని నామకరణం చేసినవాడు ప్రసాద్. దళిత సాహిత్యం మీద అతనికి బోలెడంత ప్రేమ వున్నప్పటికీ ఆనాటి దళిత కవుల పై సరైన సదభిప్రాయం లేదు వాడికి. అనేక సిట్టింగులో వాళ్ళ కెరీరిజం ను వ్యతిరేకిస్తూ నిదించేవాడు.   

మొండివాడు:

అయినవాడు  అయినంత  మాత్రాన ఆత్మహత్య వంటి మరణాన్ని స్వీకరించాడని నేనేమీ వెనుకేసుకొని రాను గానీ వాడిలా బ్రతకడమూ అందరికీ సాధ్యంకాదు. అనుకున్నట్లు  బ్రతికాడు. అనుకున్నది రాశాడు. అనుకున్నట్లుగానే మరణించాడు.

వొకసారి రాత్రి నాగిళ్ళ టవర్స్ నుండి” రాయలసీమ రుచులు”   వరకు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ మెత్తెళ్ళకూర  దొరుకుతుందట. అది వాడికి చాల ఇష్టం. తెచ్చుకున్నాం. తిన్నాం  అది వేరే విషయం. ఇక్కడ మెత్తళ్ళకూర కాదు ప్రత్యేకత . ప్రత్యేకత ఏమిటంటే అది వాడి స్వభావం.

వొకసారి అప్పుడే కవిత్వం రాయడం మొదలుపెట్టిన మైనారటి కవి మా ఇద్దర్ని రాత్రి భోజనానికి ఆహ్వానించాడు.  సరె! మాకు కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి వొక ఇల్లు కావాలి కదా! వెళ్దాం అన్నాడు.

రాత్రంతా సదరు జూ.మై. కవి మాఇ ద్దర్ని ఇంటర్యూ  పేరిట ప్రశ్నలపైన ప్రశ్నలు. కొన్ని ఆన్ లైన్  ప్రశ్నోత్తరాలు. కొన్ని ఆఫ్ ద రెకార్డ్ ప్రశ్నోత్తరాలు. దీనిలో భాగంగా సదరు జూ.మై. కవి నన్ను ఆరోవర్ణం తర్వాత ముస్లిం వాద కవిత్వం రాయనందుకు శపించాడు. రాయమని డిమాండ్ చేశాడు. అప్పుడు ప్రసాద్ కలుగజేసుకొని ఇక్బాల్ గాడు రాయడు. అంతే అని తెగేసాడు. వాడికి ఆరోవర్ణం వొక్క కవిత చాలు. ఇంకా చాల మట్లాడాడు గానీ అది ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతం. ప్రసాద్ తో తిరగద్దు అని కొంతమంది నన్ను హెచ్చరించారు. కానీ అప్పటికే అరే , వురే అని పిలుచుకొనే అతి తక్కువ నా స్నేహితుల్లో కలేకూరి వొకడు. మరి వాణ్ని ఎలా వదిలేది? వాడి అమృత హస్తాలను ఎలా తృణీకరించేది?­­­

అతని కవిత్వం పుస్తకం రూపంలో వచ్చింది. సంపాదకుడు నామాడి శ్రీధర్ . ఈ నెల 31న ఆవిష్కరణ.

రండి! వాడి గురించి మరింత మాట్లాడుకుందాం!    

Leave a Reply

avatar
  Subscribe  
Notify of